యక్షులు
దర్శన శాస్త్రాల ప్రకారం, మానవ జీవనమందు, పరిపాలకులు వంటి ఉన్నత అధికార పదవులలో ఉన్నవారు, ఆ స్థితి నుండి తొలగించబడి, తర్వాత మరణించినచో...అటువంటివారు మరణానంతరం "యక్ష యక్షిణీలు"గా జన్మనెత్తెదరు. సాధారణంగా వీరు శక్తి శాలురుగా ఉంటారు.
సాధారణంగా యక్ష యోనుల జీవాత్మలు ఎవరినీ బాధించవు. వారి అడుగు జాడలలో ఉండెడి సాధకులపై కృపను ప్రసరిస్తాయి. తమ భక్తులకు ధన ధాన్యములను, భౌతిక సుఖాలను ప్రసాదిస్తారు "యక్ష యక్షిణులు". ఇక జీవ పరిణామ క్రమంలో రాక్షస యోనుల కంటే యక్ష యోనులు ఉన్నతంగానూ, ఉపకారం చేసేవిగానూ ఉంటాయి. చాలా కాలం క్రిందట నేను యక్ష సాధన చేసేటపుడు, సాధన సిద్ధించిన సమయంలో సుగంధమును వెదజల్లుతూ ఒక యక్షిణి(పేరు చెప్పలేదు)కనుల ముందు సాక్షాత్కరించింది. నేను ఏమీ కోరక పోయేసరికి, ఆ యక్షిణి, దగ్గరలో గల చెట్టు వద్దకు వెళ్ళి అదృశ్యం అయింది. కానీ అది "ముక్తత్వానికి" ఇబ్బందని, ఆ సాధనలను వదలి వేశాను. మనస్సు యొక్క సాకార లేదా వ్యక్తావస్థలో మనం ఉన్నాం. మనస్సు యొక్క అవ్యక్తావస్థలో ఈ యక్షులు లాంటి గణాలు ఉంటాయి. వ్యక్తావస్థ కంటే అవ్యక్తావస్థయే ఎక్కువగా ఉంటుంది. మనం ఆ యక్షావస్థల్లోనే గడిపాం అనుకోండి, తర్వాత జన్మల్లో ఆ యక్ష యోనుల్లోనే జన్మించాల్సి ఉంటుంది.
ఇక మన హిందూ పురాణేతిహాసాల కధనాల ప్రకారం యక్ష, రాక్షసుల సృష్టి ఇలా వర్ణించబడి ఉన్నది.
"పులస్యుడు", కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన "హవిర్భు"ను వివాహమాడినాడు. "హవిర్భు" ద్వారా పులస్యునికి "అగస్త్యుడు" జన్మించాడు. పులస్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన "తృణబిందు" నకు "విశ్రావసుడు" కలిగాడు. సుమాలి కూతురైన కైకసి వలన విశ్రావసునికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు మరియు శూర్పణఖ జన్మించారు. మరో భార్య "ఇద్విద" ద్వారా "కుబేరుడు"(వైశ్రవణుడు) జన్మించాడు. ఈ కుబేరుడే యక్షుల రాజు. సకల సిరి సంపదలకు నిలయమైన యక్షుల రాజ్యానికి రాజు "కుబేరుడు". వీరి రాజధాని "అలకాపురి".
పాండవులు, తమ వనవాస కాలంలో "ఘటోత్కచుని" సహాయంతో యక్షుల రాజ్యాన్ని సందర్శించి, కుబేరుని ఆతిథ్యాన్ని పొందుతారు.
ఇక మహాభారతంలో ఉన్న "సౌగంధికాపహరణం" ఘట్టం మీకు తెలిసినదే. మహాభారతంలో "యక్షుల" ప్రస్తావన విశేషంగా ఉన్నది.
ఇక మన పురాణేతిహాసాలలో గల..... హరికేశుడు, కుబేరుడు(వైశ్రవణుడు), నల కూబరుడు, పూర్ణ భద్రుడు, మణిభద్రుడు, తాటకి(రామాయణం), శాలి (సింహంగా మారిన ఒక యక్షుడు), సౌదాసుడు, స్థూనుడు, స్థూన కర్ణుడు, యముడు(యక్ష ప్రశ్నలలో , యక్షునిగా కనిపిస్తాడు).
అలాగే భగవద్గీత యందలి విభూతి యోగంలో కూడా యక్షుల స్పర్శ కలదు.
భగవద్గీత యందలి విభూతి యోగంలో ఇలా చెప్ప బడింది.
|రుద్రాణాం శంకరశ్చాస్మి
విత్తేశో యక్షరక్షసామ్ |
మసూనాం పావకశ్చాస్మి
మేరు: శిఖరిణామహమ్ ||
తాత్పర్యము : నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.
అనగా భగవద్గీత యందునూ "యక్షుల ప్రస్తావన" కలదు.
భట్టాచార్య
No comments:
Post a Comment