Wednesday, March 18, 2020

కోటేరు

*కోటేరు లాంటి ముక్కు  అంటారు.  దయచేసి వివరించ గలరు*
----------------------------

కోటేరు అన్నది కోట +ఏరు అన్న రెండు పదాల కలయిక.

*కోట్- అన్న ధాతువుకు వంగిన అన్న అర్థాలున్నాయి.  తమిళంలో, మలయాళంలో కోటుకై అంటే వంగిన చేయి. తెలుగులో కూడా కొడవలి అన్న పదంలో ఉన్న కొడ్- వంగిన అన్న అర్థంలోదే. అలాగే, గోడివడు- అంటే వంగు అన్న అర్థం కూడా దీనికి చెందిందేనని నా అభిప్రాయం.

ఏరు- అన్నది మళ్ళీ నాగలికి సంబంధించిందే. భద్రిరాజు కృష్ణమూర్తి ప్రకారం దీని మూలధాతువు *చేర్-. కన్నడ, తమిళాదులలో ఇది ఆర్, ఎర్, సేర్ అని కూడా కనిపిస్తుంది. 

తమిళంలో కోటర్ అంటే నాగలి చివర భాగం, అంటే కఱ్ఱు (ploughshare). తెలుగులో కూడా ఉన్న కోటేరు నాగలి చివరిభాగాన్నే సూచిస్తుందని భావించాలి (నాగటి దుంప యందు అమర్చెడి ఇనుప పాళము). అయితే కోటేరు లాంటి ముక్కు అన్నప్పుడు పూర్తిగా నాగలి రూపాన్ని తలపించే ముక్కనే అనుకోవాలి. ముక్కు దూలం మహా సూటిగా ఉండి చివర నాగటి  కఱ్ఱు లాగా వంపు తిరిగినది అని భావన.

No comments:

Post a Comment