Friday, January 24, 2025

వృషకేతుడు

 వృషకేతుడు!

మహాభారతంలో ని విశేష వ్యక్తులు

కర్ణుని భార్యలు ఇద్దరు

1.వృషాలి  9 మంది కుమారులు

2.సుప్రియ 1వృషకేతు

ఇతను మహాభారతయుద్ధం తరువాత బతికి ఉన్న వాడు. పాండవులదగ్గర పెరిగాడు

ఇది సంక్షిప్తంగా

ఇహ చదవండి

మన మహాభారతం ఒక మహా సముద్రం వంటిది. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇన్ని పాత్రలతో కూడుకుని, ఇంత విస్తృత చరిత్ర కలిగి ఉన్న గ్రంథం మరోటి ఉండదేమో! అందుకే, "యది హాస్తి తదన్యత్ర, యన్నే హాస్తి నతక్వచిత్!" అని గంటం వాయించారు వ్యాసుల వారు.(ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు! అంటే, భారతంలో ఉన్నదే లోకంలో ఉంది. భారతం లో లేనిదేదీ లోకంలో  లేదు). అంతటి సమగ్ర కావ్యం మహాభారతం!


కౌరవులకు పాండవులకు జరిగిన మహా సంగ్రామంలో కర్ణాది మహావీరులను సంహరించి సమధర్మాన్ననుసరించి చనిపోయిన వారి పిల్లలను, వృద్ధులను, వారి సేవక జనాలను పాండవులు సంరక్షించారు.


అలా సంరక్షించబడ్డ బిడ్డలలో కర్ణకుమారుడొకడు. ఇతడి పేరే వృషకేతుడు. కర్ణునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య వృశాలి దుర్యోధనుని రథ సారథి కుమార్తె. ఈవిడ కి తొమ్మిది మంది కొడుకులు. ఒక కొడుకు బాల్యంలో చనిపోగా, మిగిలిన ఎనిమిది మంది కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయారు. రెండవ భార్య సుప్రియ దుర్యోధనుని భార్య భానుమతీదేవి నెచ్చెలి. ఈవిడ కుమారుడే వృషకేతుడు. యుద్ధానంతరం ఇతణ్ణి చేరదీస్తారు పాండవులు. ఇతడికి అర్జునుడు ధనుర్విద్య, భీముడు గదా యుద్ధం నేర్పుతారు. శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రం, వరుణ, అగ్ని, వాయువ్యాస్త్రాలనుపదేశిస్తాడు. అయితే, ఈ నాలుగు ఏక కాలంలో ప్రయోగిస్తే భూమి మీద జీవరాశి మిగలదు కనుక, ఈ అస్త్రాలను ఇతరులెవరికీ ఉపదేశిఃచవద్దని, ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెసలుకొమ్మని చెప్తాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలిసిన చివరి యోధుడు వృషకేతుడు ఒక్కడే!


కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన మారణహోమాన్నీ, వంశ క్షయాన్నీ తలచుకుని తాము చేసిన పాపానికి పరిహారం ఉండదని ధర్మరాజు చింతిస్తూన్న సమయంలో వ్యాసుడు వచ్చి అశ్వమేధ యాగం చేస్తే పాపాలు పోతాయని చెప్తాడు. అయితే, ఆ యాగానికి యోగ్యమైన అశ్వం భద్రావతీపురం రాజైన యవనాశ్వుని వద్ద ఉందని, అతన్ని ఓడించి అశ్వాన్ని సంపాదించడం ఆషామాషీ వ్యవహారం కాదని చెప్తాడు.


కురుక్షేత్ర సంగ్రామం చేసి అలసి ఉన్న సోదరులను తిరిగి యుద్ధానికి పంపడం సమంజసం కాదని, కృష్ణుడు కూడా సమయానికి అందుబాటులో లేకపోయాడే అని ధర్మరాజు విచార పడుతున్న సమయంలో వృషకేతుడు ముందుకొస్తాడు అశ్వాన్ని తెస్తానంటూ. అతడు చిన్నవాడని, అలా యుద్ధానికి పంపడం సముచితం కాదని ధర్మరాజు సందేహిస్తూంటే ధర్మరాజుని  ఒప్పించి బయలుదేరుతాడు వృషకేతుడు. వృషకేతుడికి తోడు గా భీమసేనుని పంపిస్తాడు ధర్మరాజు.


వృషకేతుడు యవనాశ్వునితో యుద్ధం చేసి యాగాశ్వాన్ని సంపాదిస్తాడు. యాగాశ్వం విడిచి పెట్టబడుతుంది. అర్జునిడితో వృషకేతుడు కూడా వెంట వెళ్తాడు. బబ్రువాహనుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు. అతడితో యుద్ధం చేస్తూ వృషకేతుడు హతుడౌతాడు. (అర్జునుడు కూడా హతుడౌతాడు. కానీ, ఆ వృత్తాంతం వేరే సందర్భంలో చెప్పుకుందాం). వృషకేతుడు తన సోదరుడే అని తెలుసుకుని తండ్రిని క్షమాపణ కోరతాడు బబ్రువాహనుడు. అప్పుడు అర్జునుని మరో భార్య అయిన నాగకన్య ఉలూచి నాగమణి ప్రభావంతో వృషకేతుని బ్రతికిస్తుంది. ఈ వృత్తాంతం పిల్లలమర్రి పిన వీరభద్రుని జైమినీ భారతంలో ఉంది. (మిత్రులు కి ఒక సందేహం కలగవచ్చు. మరి ఉలూచి చేత చనిపోయిన అభిమన్యుని, ఇతర పాండుపుత్రులను కూడా బ్రతికించుకో వలసింది కదా అర్జునుడు... అని. అందుకే ఈ వృత్తాంతం జైమిని భారతం లోనిది అన్నాను.).



అశ్వమేధ యాగం దిగ్విజయంగా నిర్వహించాక, వృషకేతునికి అంగ, ఇంద్రప్రస్థ రాజ్యాలను పట్టం కడతాడు ధర్మజుడు. ఎన్నో సంవత్సరాలు జనరంజకంగా పాలన చేసి వృద్ధాప్యం లో సహజ మరణం పొందుతాడు వృషకేతుడు. ఇదీ వృషకేతు చరిత్ర!  స్వస్తి!

No comments:

Post a Comment